Tuesday 23 December 2008

నా బ్లాగు

నా పేరు శ్రీనివాస్
నా ఇల్లు In రాంనివాస్
నాకు లేదు bus pass
తీసుకుంటే money loss

నాకు బాగా గుర్తుండి ఇది నేను నేను 7th క్లాసు చదువుతున్నప్పుడు రాసిన మొదటి తవిక . నేను ఏవ్వరికి తెలియకుండా రాసుకున్న కవితని , ఏవ్వరికి ( నాకు కూడా ) తెలియకుండా స్వప్న చదివేసింది ( ఏంటో.. అది ఇప్పటికి ఆరోగ్యంగానే ఉంది ) . తన ద్వార క్లాసులో సగం మందికి సీక్రెట్ గా నేనో కవయిత్రిని అని తెలిసిపోయింది . అప్పటి నుంచి నన్నో సరోజిని నాయుడులా , కవయిత్రి మొల్లలా ( పోలిక కొంచం ఓవర్ ఐనట్టు ఉంది కాదు..లైట్ తీసుకోండి.. :) ) ఇంకా అదోలా ..చూసే వాళ్ళు . ఆ రెపుటెషన్ని జాగర్త గా కాపాడుకుంటూ , 8th లో స్కూల్ మారాను . సరేలే కొత్త స్కూల్లో మన టాలెంట్ ని చూపిదాం అని ఒక కవిత వాదిలా .. అంతే , అందరు నన్నో సినిమాల్లో కవితల పిచ్చి శ్రీలక్ష్మిలా చూడటం మొదలు పెట్టారు . ఆ అవమానం పెనుభారంగా అనిపించి నేను కవితలు రాయటం చాలా వరకు తగ్గించా .. రాసినా , ఎవరికీ చూపించే దాన్ని కాదు ( చూసారా.. నేను అంత చిన్న వయసులోనే అజ్ఞాతం లోకి వెళ్ళిపోయా !!. )

సరే రోజులన్నీ ఒకేలా ఉండవులే అనుకోని డిగ్రీ లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ లో నేను వెలగబెట్టిన ఒక కవితని శ్వేత కి చూపించా... ఆరోజు నాకేదో ఆరోగ్యం బాగొలేదేమో అన్నట్టు నన్ను జాలిగ చూడటం మొదలెట్టింది . అసలు నేను రాసిందో కవిత అని కూడా దానికి అర్ధం కాలేదట :( . అంతే.. నా మనసు పరిపరి విధాలా ముక్కలయి బాధపడింది . ఈమాత్రం కళాపోసన లేని వాళ్ళ మధ్య ఇన్నాళ్ళు ఏలా ఉన్నానా అని హాచార్య పోయా ..!

ఆరోజు తరవాత ఇంక ఏవ్వరికి నేను గీసిన పిచ్చి గీతలుకూడా చూపించకూడదు అని శపథం చేసేసుకున్నా ! సాధ్యమయినంతవరకు నాలో ఉన్నా భావావేశాన్ని అణగదొక్కి , నలుగురిలో నేను మీలాంటి దాన్నే అనిపించుకోటానికి , జనజీవనస్రవంతిలో కలిసిపోటానికి ప్రయత్నించా . అప్పట్లో బ్లాగుల గురించి తెలియదు కనుక ఏప్పుడన్నా ఏదన్నా రాసినా , గీసినా నాలుగు రోజులు నేనే చూసుకొని మురిసిపోయి పారెసేదాన్ని .

ఇక్కడ నేనో విషయం అసందర్బం అయినా చెప్పదలుచుకున్నా .. పిల్లలకి చదువు తప్ప ఇంక ఏ ఇతర వ్యాపకం ఉండకూడదు అని తలితండ్రులు భావిస్తారు. ఏమైన కళల పట్ల అభిరుచి ఉన్నట్లు కనీసం గమనించరు . గమనించినా ప్రోత్సహించరు . ఇది అన్ని విషయాల్లో ఉండదు మళ్ళి.!! అబ్బాయి క్రికెట్ అంటే ఓకే అంటారు . అమ్మాయి డాన్స్ అంటే ఓకే అంటారు . కాని అదే పిల్లలు నేను కవితలు రాస్తాను, కధలు రాస్తాను అంటే ఆ ప్రోత్సహం ఉండదు.! క్లాసు పుస్తకాలు చదివే పిల్లవాడి మీద ఉన్న సదభిప్రాయం కధల పుస్తకాలు చదివే పిల్లవాడి మీద ఉండదు. బొమ్మలు గీయటం లో ఉన్న ఇష్టం సిలబస్ లో ఉన్న హార్ట్ నో కిడ్డ్నీనో గీయటం తోనే సరిపెడతారు. అందరు తలితండ్రులు ఇలానే ఉంటారు అనను . కాని చాలా మంది ఇలానే ఉంటారు .

ఏదేమయినా ఈ సంవత్సరం ఒక బ్లాగ్ ప్రారంభించటం సంతోషంగా ఉంది . నా ఈ బ్లాగ్ లో నేనేం రాసినా చదవటానికి ఏవ్వరు లేక పోయినా , చింపుకోకుండా నే రాసింది దాచుకోటానికో చూటు ఉందని హాయిగా ఉంది..!నేను రాసింది నచ్చలేదు అన్నా నొచ్చుకునే అంత పసిమనసు ఇప్పుడు కాదు . కొత్త సంవత్సరంలో అయినా నా ఆలోచనలు మీతో విరివిగా పంచుకుంటాను .

క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు